తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
By అంజి Published on 8 Feb 2024 1:30 PM ISTతెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన మొదలైందన్నారు. ప్రజాభవన్ చుట్టూ కంచె తొలగించి.. ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారని అన్నారు. ఇప్పటికే 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామని గవర్నర్ పేర్కన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామన్నారు. త్వరలోనే మరో రెండు అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలిపారు.
2 లక్షల ఉద్యోగాల భర్తీపై కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. యువకుల బలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన ఆమె.. తెలంగాణ ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు చెబుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కార్‌కు రాష్ట్రం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోందని వెల్లడించారు. తెలంగాణకు కొత్తగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఇటీవల దావోస్ పర్యటనలో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి రూపాయి తెలంగాణ సంక్షేమం, ప్రజల పురోగతికి దోహదపేలా బడ్జెట్ ఉంటుందని హామీ ఇచ్చారు. వెయ్యి ఎకరాల్లో 10 - 12 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే.. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు. గత సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం మొదలుపెట్టామన్నారు. దశాబ్దంగా నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ, ఎస్‌హెచ్‌ఆర్‌సీ వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పని చేసే స్వేచ్ఛ కల్పిస్తామని వెల్లడించారు.