జనవరి 26 నుంచి రైతు భరోసా.. ఆ భూములకు పథకం లేనట్టే!
పంట పండించే ప్రతి అన్నదాతకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ముహూర్తం ఖరారు చేసింది.
By అంజి Published on 10 Jan 2025 7:01 AM ISTజనవరి 26 నుంచి రైతు భరోసా.. ఆ భూములకు పథకం లేనట్టే!
పంట పండించే ప్రతి అన్నదాతకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సూచనలను పరిశీలించిన ప్రభుత్వం.. విధివిధానాలను ఖరారు చేసి ఈ నెల 26 నుంచి పథకం అమలుకు నిర్ణయించింది. గత ప్రభుత్వం రైత బంధు పథకం కింద ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం రెండు విడతలుగా (ఖరీఫ్, రబీ సీజన్లు) ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
జనవరి 26 నుంచి యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో దాదాపు కోటికిపైగా ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు రూ.5,500 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాళ్లు రప్పలు ఉన్న భూములు, మైనింగ్ కోసం ఇచ్చిన భూములు, రహదారి నిర్మాణంలో భాగంగా పోయిన పోలాలు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భూముల విషయమై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని ప్రభుత్వం పేర్కొంది.