12 మంది అధికారుల కేడర్ కేటాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Key comments of Telangana High Court on cadre allocation of 12 officers. హైదరాబాద్‌: 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దాఖలైన అన్ని పిటిషన్లను

By అంజి  Published on  20 Jan 2023 8:44 AM GMT
12 మంది అధికారుల కేడర్ కేటాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దాఖలైన అన్ని పిటిషన్లను విడివిడిగా విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. 12 మంది అఖిల భారత సర్వీసు అధికారుల కేడర్ కేటాయింపుపై వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. మరోవైపు వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని పిటీషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం అవిభాజ్య రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కేంద్రం ప్రభుత్వం.. ప్రత్యూష్‌ సిన్హా కమిటీ సూచన మేరకు స్థానచలనం చేసింది. ఈ ప్రక్రియలో ఈ అధికారులను డిఓపిటి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. అయితే అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకున్నారు. 2017లో క్యాట్‌ ఆర్డర్‌ను నిలిపివేయాలని కోరుతూ డిఓపిటి హైకోర్టుకు వెళ్లింది.

కాగా.. ట్రిబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. ప్రతి పిటిషన్‌ను రెగ్యులర్ బెంచ్ విడివిడిగా విచారిస్తుందని చెప్పారు. ఈ కేసు విచారణను హైకోర్టు జనవరి 27కి వాయిదా వేసింది

అధికారుల్లో ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ భిస్ట్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాథ్ ఉన్నారు. వీరితోపాటు ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, అనంతరాము, సృజన, శివశంకర్, మల్లెల ప్రశాంతి కూడా జాబితాలో ఉన్నారు.

ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ కూడా ఈ అధికారుల్లో ఒకరు కావడంతో.. ఒక వేళ అంజనీకుమార్‌ను ఏపీకి బదిలీ చేస్తే ఆ స్థానంలో కొత్త డీజీపీ రావాల్సి ఉంటుంది. అలాగే ఆయా అధికారుల స్థానాల్లో కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. వీరి కేడర్ పై హైకోర్టు త్వరలోనే కీలక తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కి బదిలీ చేస్తూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Next Story