ఒకేసారి రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉందని ధరణి కమిటీ సభ్యుడు ఏం.కోదండరెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. రైతు రుణమాపీ ఏకకాలంలో చేస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అన్నదాతల అప్పుల పూర్తి సమాచారం రాగానే అమలు చేయనున్నట్టు వెల్లడించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఫిషర్‌మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం తదితరులతో కలిసి కోదండరెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడారు.
అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ధాన్యానికి మద్దతు ధర కంటేఏ తక్కువ వచ్చినప్పుడే బోనస్ రూ.500 ఇస్తామని చెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మద్దతు ధర రూ.2060 కాగా.. కొనుగోలు కేంద్రాల్లో రూ.2600 ఇస్తున్నారు. మరోవైపు రూ.2 లక్షల రుణమాఫీ హామీపై చాలా మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీపై మొన్న జరిగిన బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పథకం అమలుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.