కేసీఆర్‌ బానిసల ఎత్తులను తిప్పికొట్టాలి.. హుజురాబాద్‌ ప్రజలకు ఈటల విజ్ఞప్తి

KCR should thwart the conspiracies of slaves.. Etela Rajender's appeal to the people of Huzurabad. ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలో భాగంగానే పాడి కౌశిక్‌ రెడ్డి హుజురాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం

By అంజి  Published on  4 Aug 2022 7:48 PM IST
కేసీఆర్‌ బానిసల ఎత్తులను తిప్పికొట్టాలి.. హుజురాబాద్‌ ప్రజలకు ఈటల విజ్ఞప్తి

ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలో భాగంగానే పాడి కౌశిక్‌ రెడ్డి హుజురాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజలు.. ఈ నీచపు కుట్రలను, కేసీఆర్‌ బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందంటూ.. హుజురాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేసీఆర్‌.. హుజురాబాద్‌ ప్రజల మీద, తన మీద కక్ష గట్టారని 2018లోనే తనను ఓడించేందుకు, తనకు వ్యతిరేకంగా నిలబడ్డ వారికి డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. తన ఇళ్లపై రైడింగ్‌ చేయించారని, డబ్బులు ఇచ్చి కొంతమందితో తన మీద కంప్లైంట్‌ చేయించి, పోస్టర్లు వేయించి.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారన్నారు.

తాను రాజీనామా చేసిన తర్వాత కనీవినీ ఎరుగుని రీతిలో వందల కోట్ల రూపాయలు పంచి, మద్యం ఏరులై పారించి, ప్రతి కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయించి, మఫ్టీలో ఉన్న పోలీసుల చేత బెదిరించినా.. ఎంత అల్లకల్లోలం సృష్టించినా కూడా బెదరకుంటా హుజురాబాద్‌ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించారన్నారు.

''గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు లేకుండా చేశారు కేసీఆర్‌. తెలంగాణ ప్రజల పక్షాన సమస్యలు లేవనెత్తాలని అసెంబ్లీలో మాట్లాడదామంటే.. అసెంబ్లీ నుంచి కూడా గెంటివేశారు. మీరు గెలిపిస్తే నేను తీసుకుంటానా అని ప్రజాభిప్రాయాన్ని కాలరాసి నన్ను బయటకి పంపించారు. నేను మీ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గాన్ని, కేసీఆర్ కుట్రలను, కేసీఆర్ నియంత్రత్వ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ఇచ్చిన ధైర్యంతో ముందుకు పోతుంటే.. నామీద కుట్రలు చేస్తున్నారు. ప్రశాంతమైన హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.'' అని ఈటల రాజేందర్‌ అన్నారు.

''ఆనాడు మానుకోట ఉద్యమంలో ఉద్యమకారుల మీద రాళ్లు వేయించిన సైకోలకు ఎమ్మెల్సీ ఇచ్చి.. ఏ రకమైన చిల్లర పనులు ఏం చేయిస్తున్నారో అందరికీ తెలుసు. కేసీఆర్, ఆయన బానిసలు ఉంటారు పోతారు కానీ ప్రజలు మాత్రం శాశ్వతం. హుజురాబాద్ గడ్డమీద ఏనాడూ కొంచెం కూడా అల్లరి లేకుండా కలిసిమెలిసి ఉండే భాగ్యం 20 ఏళ్లుగా మనకి దక్కింది. దీన్ని చూసి ఓర్వలేని కెసిఆర్ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే సమస్యల మీద మాట్లాడాలి'' అని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

దమ్ముంటే నేరుగా యుద్ధం చేయాలని, తాను చేసిన సవాలు స్వీకరించాలన్నారు. గజ్వేల్‌లో కొట్లాడుదామా? హుజురాబాద్‌లో కొట్లాడుదామా? రండి.. అంటూ కేసీఆర్‌కు ఈటల సవాల్‌ విసిరారు. దమ్ముంటే సవాలు స్వీకరించి రావాలి తప్ప చిల్లర మల్లర పనులు చేసి అల్లరి చేసే ప్రయత్నం చేసే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అలాగే హుజురాబాద్‌ ప్రజా ప్రతినిధులు.. అధికార పార్టీ చేసే కుట్రలో భాగం కావొద్దని, బలి కావొద్దని విజ్ఞప్తి చేశారు. తాము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉందన్నారు. కానీ నియోజకవర్గం బాగును, ప్రశాంతతను, ఐక్యతను కోరుకునే వాళ్ళం కాబట్టి.. చిల్లర మాటలు నమ్మి అనవసరంగా రెచ్చిపోవద్దని హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

Next Story