'కేసీఆర్ న్యూట్రీషన్ కిట్'.. నేటి నుంచే ప్రారంభం
KCR Nutritional Kits to be launched on Wednesday. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 21 Dec 2022 8:58 AM ISTమాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవతంగా అమలు అవుతున్న కేసీఆర్ కిట్ సూపర్ హిట్ స్పూర్తితో 'కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల'కు రూపకల్పన చేసింది. ముందుగా రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాలో బుధవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కామారెడ్డి కలెక్టర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మిగతా ఎనిమిది జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండటం లక్ష్యంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. రక్తహీనత ప్రభావం అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్‌లలో నేటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు.
ఈ జిల్లాల్లో మొత్తం 1.50 లక్షల మంది గర్భిణులు కిట్‌ల ద్వారా నేరుగా లబ్ధి పొందనున్నారు. మొత్తం 2.50 లక్షల కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.50 కోట్లను ఖర్చు చేస్తోంది.
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లో ఏం ఉంటాయంటే..?
కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ మూడు బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండజోల్ టాబ్లెట్, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ ఉండనున్నాయని తెలుస్తోంది.