అవినీతిలో కేసీఆర్ నంబర్ 1.. ప్యాకింగ్ చేసి ఇంటికి పంపుదాం: అమిత్ షా
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేశంలోనే "అవినీతిలో నంబర్ వన్" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
By అంజి Published on 21 Nov 2023 1:52 AM GMTఅవినీతిలో కేసీఆర్ నంబర్ 1.. ప్యాకింగ్ చేసి ఇంటికి పంపుదాం: అమిత్ షా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేశంలోనే "అవినీతిలో నంబర్ వన్" అని ఆరోపించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ "అవినీతి ఒప్పందాలపై" విచారణ జరుపుతుందని అన్నారు. అవినీతిలో దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ అని, వారి అవినీతి వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ కటకటాల వెనక్కి నెట్టుతుందని అన్నారు. అభ్యర్థులు ఆరుట్ల దశమంత్ రెడ్డి, ధర్మపురి అరవింద్‌లకు మద్దతుగా జనగాం, కోరుట్ల సెగ్మెంట్లలో జరిగిన బీజేపీ ప్రచార సభల్లో అమిత్ షా మాట్లాడుతూ బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించడం లేదని, అసదుద్దీన్ ఒవైసీకి భయపడి సెప్టెంబర్ 17వ తేదీని నిర్లక్ష్యం చేస్తున్నారని, బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఒవైసీ చేతుల్లోనే ఉందని, కేసీఆర్ కుటుంబం చేతిలో కాదని అన్నారు. ''మేం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ని అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుతాం. జనగాంలో పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ హామీని నెరవేర్చలేదని.. ఇప్పుడున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, జనగామలో కొత్త అభ్యర్థి భూ ఆక్రమణలు, అవినీతిలో కూరుకుపోయారు'' అని అన్నారు.
అమిత్ షా హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు, హనుమాన్ దేవాలయం వద్ద ప్రారంభించి, హెచ్‌ఎంటి మీదుగా నాచారం వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల మధ్య రోడ్ షో జరిగింది. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు రోజు జిల్లాలలో అమిత్ షా హిందూ ఓటరు బేస్‌ను ఆకర్షించడానికి లార్డ్ రామ్ సెంటిమెంట్‌ను ప్రయోగించారు. "తెలంగాణ ప్రజలు డిసెంబర్ 3న రెండోసారి దీపావళి జరుపుకోవచ్చు, ఆపై జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించినప్పుడు మూడోసారి జరుపుకోవచ్చు. మోడీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. మేం అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని ఫ్రీగా దర్శనం చేయిస్తాం’’ అని అన్నారు.
''అరవింద్ ఎప్పటినుండో బోర్డును కోరుతూ, త్వరగా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు పసుపు రైతులకు పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. పంట యొక్క వైద్యపరమైన ఉపయోగాలను పరిశీలించడానికి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. బోర్డు మొత్తం ఉత్తర తెలంగాణకు సహాయం చేస్తుంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మేము మూడు చక్కెర కర్మాగారాలను కూడా పునఃప్రారంభిస్తాము''అని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలనీ, బీజేపీ కుటుంబ పార్టీ కాదని, దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎంగా సీఎం కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని, కేసీఆర్‌ను ఇంటికి పంపిద్దామని అన్నారు.