తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి తనదైన ప్రత్యేక స్థానం సంపాదించిన నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఆయన తన ప్రాణ త్యాగానికి కూడా సిద్దమయ్యారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఎంతో ఇష్టమైన నేతగా మారారు. ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు అమలు పరుస్తూ ప్రజాహృదయాలు గెల్చుకుంటున్నారు.
హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టారు. ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను సంతోష్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు.
తెలంగాణలో పచ్చదనాన్ని మరింతగా పెంచాలానే సీఎం కేసీఆర్ ఆశయాలను అనుగుణంగా, ప్రతీ తెలంగాణ జాగృతి కార్యకర్త మొక్కలు నాటాలని కవిత కోరారు. తను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే సీఎం కేసీఆర్కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు.
కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ను కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.