అప్పటిదాకా ఎంతో హ్యాపీగా గడిపిన ఆ కుటుంబంలోకి విషాద తుఫాను దూసుకొచ్చింది. డ్యామ్‌లోని పడిన కూతురిని రక్షించబోయి తండ్రి మృతి చెందడం వారిని ఆవేదనలో ముంచెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ (47) అనే వ్యక్తి నిన్న సెలవు దినం కావడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో పడింది.
కూతురు మునిగిపోవడం గమనించిన తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు నీటిలో దూకారు. ముగ్గురు మునిగిపోవడం చూసిన తల్లి గట్టి గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసో పేతంగా నీటిలో దూకి కూతురును, కుమారుడిని కాపాడాడు. కానీ తండ్రి విజయ్ నీటిలో మునిగిపోయి చనిపోయాడు. సంతోషంగా గడుపుతూ తమ కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో పిల్లలు డాడీ వస్తాడు, డాడీకి ఎం కాలేదంటూ ఏడవడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.