ఆందోళన వద్దు.. రైతుల భూములు ఎక్కడికి పోవు: కామారెడ్డి కలెక్టర్
Kamareddy Collector Jitesh Patil Responds On Kamareddy Master Plan. ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్‌పై రైతుల నిరసనలపై శనివారం కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి
By అంజి Published on 7 Jan 2023 5:03 PM ISTఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్‌పై రైతుల నిరసనలపై శనివారం కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. ప్రతిపాదిత జోన్ కోసం రైతుల భూమిని సేకరించలేదని అన్నారు. మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతిపాదించిన పారిశ్రామిక జోన్ ముసాయిదా మాత్రమేనని అన్నారు. "ప్రతిపాదిత ప్రణాళికపై అభ్యంతరాలు జనవరి 11 వరకు తీసుకోబడతాయి. ఇప్పటివరకు దాదాపు 1026 అభ్యంతరాలు స్వీకరించబడ్డాయి" అని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనన్న కలెక్టర్.. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై ఎవరైనా సరే సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చు అని కామారెడ్డి కలెక్టర్ తెలిపారు. భూములు పోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్. భూములు పోతాయని ఎందుకు అపోహ పడుతున్నారో తెలియడం లేదన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అని తెలిపారు.
పట్టణ విస్తరణ ఆధారంగానే మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. ముసాయిదా ఫైనల్ కావాడానికి చాలా దశలు ఉన్నాయి. ప్రస్తుతం ముసాయిదా మొదటి దశలోనే ఉందన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూముల సేకరణ కాదు అని కలెక్టర్ జితేశ్ పాటిల్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్‌పై కామారెడ్డి జిల్లా రైతులు తెలంగాణ హైకోర్టులో శనివారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండానే రిక్రియేషనల్ జోన్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైతులను ఇబ్బంది పెట్టడానికే మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాల్లో రైతు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రైతులు బంద్ పాటించారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిరసనలు తెలిపారు. పోలీసులు, జిల్లా కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రైతులు, పోలీసులు వాగ్వాదానికి దిగారు.