రేపే భద్రాద్రి రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు పూర్తి

భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

By అంజి  Published on  16 April 2024 2:15 PM GMT
Sreesitaram Kalyanam, Bhadrachalam, Telangana

రేపే భద్రాద్రి రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు పూర్తి 

భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు.

స్వామివారి కల్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్‌లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులు https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు, వసతి గదుల బుక్‌చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా భద్రాచలం ఆలయానికి శ్రీరామ నవమి పండుగకు పట్టువస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించింది. ఏప్రిల్ 17, బుధవారం భద్రాచలం ఆలయంలో జరిగే శ్రీ సీతారామస్వామి కల్యాణం వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా పోలింగ్ సంఘం మరోసారి తిరస్కరించింది.

“అవసరమైతే, సంబంధిత శాఖ కార్యదర్శి లేదా తగిన అధికారి ఎవరైనా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతి లేదు, ”అని ఈసీ లేఖలో పేర్కొంది. లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి కోరుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాగా, తిరస్కరణకు గురైంది.

Next Story