తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండానే రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'సామాజిక తెలంగాణ' లక్ష్యంగా, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకోవడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ మేరకు ఆమె 'జాగృతి జనం బాట' పేరుతో తన యాత్ర వివరాలతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ తర్వాత ఈ యాత్రను ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో పర్యటించాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు.
ఈ యాత్రలో భాగంగా కవిత రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాజకీయంగా భవిష్యత్తులో ఎలా ముందడుగు వేయాలనే అంశంపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, ఇప్పుడు చేపట్టబోయే ఈ యాత్రకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.