కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రం వివక్ష చూపెడుతోందని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోహదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరి ప్రజల మధ్య అసమానతలను పెంచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వాదులు, దళిత మేధావులు.. ఈ విషయంపై ఆలోచించి అప్రమత్తం అవ్వాలని సూచించారు.
హనుకొండలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ.. కులమతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. 1961 నుంచి 2021 వరకు ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను పెంచలేదని వెల్లడించారు. దేశ జనాభాలో ఎస్సీలు18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర సర్కార్ విఫలమైందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేశారని చెప్పారు. రాష్ట్రంలో దళితబంధు, గిరిజన బంధు అమలు చేస్తున్నామని, ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని వెల్లడించారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా దళిత, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 60 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచకపోవడంపై ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు.