కడెం ప్రాజెక్టుకు భారీ వరద, తెరుచుకోని 4 గేట్లు..దిగువ ప్రాంతాల్లో వణుకు

నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్‌ జోన్‌లో ఉంది. కెపాసిటీకి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

By Srikanth Gundamalla  Published on  27 July 2023 11:18 AM IST
Kadem Project, In Danger, Floods, Telangana ,

కడెం ప్రాజెక్టుకు భారీ వరద, తెరుచుకోని 4 గేట్లు..దిగువ ప్రాంతాల్లో వణుకు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం పెరిగి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కొన్ని ప్రాజెక్టులకు అయితే కెపాసిటీని మించి వరద వస్తోంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్‌ జోన్‌లో ఉంది. కెపాసిటీకి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3.5 లక్షల క్యూసెక్కులు కాగా.. అంతకు మించే వరద వస్తోందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 18 గేట్లు ఉండగా ప్రస్తుతం 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మిగతా నాలుగు గేట్లు తెరుచుకోవడం లేదని.. మొరాయిస్తున్నట్లు అధికారులె చెప్పారు. 2 లక్షల 19వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ నుంచి వరద నీరు వెళ్లిపోతుంది. దీంతో.. దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. నాలుగు గేట్లు తెరుచుకోకపోవడం... ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఏం జరుగుతుందో అని భయపడిపోతున్నారు.

అయితే.. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు అధికారులు వెళ్లారు. అక్కడ వరదను చూసి ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఉరుకులు, పరుగులతో కారెక్కి వెళ్లిపోయారు. దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమవుతోంది అధికార యంత్రాంగం. హెలికాప్టర్లను సిద్ధం చేశారు. కడెం ప్రాజెక్ట్‌కు వెళ్లే దారుల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపైకి వరద పోటెత్తింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.

కడెం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం నాలుగు గేట్లు తెరుచుకోవడం లేదని, దేవుడే కాపాడాలని చెప్పుకొచ్చారు. వరద తగ్గాలని భగవతుండిని కోరుకుంటున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అయితే.. తెరుచుకోని నాలుగు గేట్లకు వెంటనే మరమ్మతులు చేసేందుకు నిపుణులను పిలిపిస్తున్నట్లు తెలిపారు. వరద తగ్గితే కట్టమైసమ్మకు మొక్కు చెల్లించుకుంటానని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కాగా.. ఇప్పటికే 12 లోతట్టు గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాల‌కు త‌ర‌లించామని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. కడెంతో పాటు పాండవపూర్ వంతెన వద్ద వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. నిర్మల్-మంచిర్యాల రూట్లలో రాకపోకలను అధికారులు నిలిపేశారు.

Next Story