'వర్షం గురించి భయపడకండి.. నేను ఆగు అంటే అది ఆగిపోతుంది' అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో శాంతి సభ నిర్వహించనున్నారు. సభకు ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరిన ఆయన.. వర్షం గురించి ఆలోచించవద్దని, తాను ఆగమని చెబితే వర్షం ఆగిపోతుందన్నారు. గద్దర్‌తో కలిసి పాల్ తన భేటీపై మీడియాతో మాట్లాడారు. దేశానికి, దేవుడికి, సత్యానికి, శాంతికి వర్షం ఎప్పుడూ ఆటంకం కాదన్నారు.
75 ఏళ్ల క్రితం శాంతిభద్రతలతోనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, అయితే ఇప్పటికీ కొందరు కులాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు శాంతికి మద్దతిస్తారా లేదా యుద్ధానికి మద్దతు ఇస్తున్నారా అని పాల్ ప్రశ్నించారు. సత్యం వైపు ఉంటారా.. అసత్యం వైపు ఉంటారా అని నిలదీశారు. తాను అమెరికాలో దాదాపు 300 బహిరంగ సభలు నిర్వహించానని, ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదని కేఏ పాల్ చెప్పారు. కానీ ఇక్కడ తన దేశంలో చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గద్దర్, కోదండరామ్ వంటి ప్రజానాయకులు తనకు మద్దతిస్తున్నారని పేర్కొన్న పాల్, తన సమావేశానికి హాజరు కావాలని, ప్రపంచ శాంతిపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. అన్ని సమస్యలకు ఆర్ధిక అసమానతలే కారణమని గద్దర్ అన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా జరిగే ప్రపంచ శాంతి మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.