నేటి నుంచే నిర‌స‌న‌లు..

Junior Doctors protests from Today. క‌రోనా విల‌య తాండ‌వం కొన‌సాగుతున్న ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వానికి జూడాలు(జూనియ‌ర్ డాక్ట‌ర్లు) షాక్ ఇవ్వ‌బోతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 4:42 AM GMT
Jr doctors

క‌రోనా విల‌య తాండ‌వం కొన‌సాగుతున్న ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వానికి జూడాలు(జూనియ‌ర్ డాక్ట‌ర్లు) షాక్ ఇవ్వ‌బోతున్నారు. త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం నిర్ణీత గడువులోగా ప‌రిష్క‌రించ‌క‌పోతే ఈ నెల 26 నుంచి విధులు బ‌హిష్క‌రించి స‌మ్మెకు దిగుతామ‌ని తెలంగాణ జూనియ‌ర్ డాక్ట‌ర్ల సంఘం హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలోనే న‌ల్ల‌బాడ్జీలు నిర‌స‌న బాట ప‌డుతున్న‌ట్లు తెలిపారు. నేటి(ఆదివారం) నుంచి నుంచి ఈ నెల 26 వరకు నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించిన 15 శాతం స్టైఫండ్ పెంపు అమలు కాకపోవడంతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు గతంలో ప్రకటించిన పదిశాతం ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. అటు సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా నోటీసు ఇచ్చారు. గౌరవవేతనాన్ని 15 శాతం పెంచాలని, హెల్త్ కేర్ వర్కర్లకు గతంలో ప్రకటించిన పదిశాతం ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొవిడ్ బారిన పడ్డ వైద్యసిబ్బందికి నిమ్స్​లో చికిత్స అందించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

విధుల్లో చనిపోయిన వైద్యులకు రూ. 50 లక్షలు, నర్సులు, సిబ్బందికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాని ప‌క్షంలో ఈ నెల 26 త‌రువాత విధులు బ‌హిష్క‌రించ‌నున్న‌ట్లు హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ల‌కు గాంధీ, టిమ్స్‌, కింగ్ కోఠి జూనియ‌ర్ వైద్యులు నోటీసులు ఇచ్చారు.


Next Story
Share it