జూడాల సమ్మె విరమణ.. విధులకు హాజరు
JR Doctors called off strike and join in duties.ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.
By తోట వంశీ కుమార్ Published on 28 May 2021 1:48 AM GMTప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. డీఎంఈతో చర్చల తర్వాత 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారు తమ ఆందోళనను విరమించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన స్టైఫండ్ చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో రెండు రోజుల పాటు విధులు బహిష్కరించిన జూడాలు గురువారం రాత్రి సమ్మె విరమించారు. సీఎం కేసీఆర్ చొరవతో తాము గురువారం రాత్రి 9 గంటలకు విధుల్లో చేరినట్లు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా బారిన పడితే వారికి నిమ్స్‌లో చికిత్స అందించాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌కు కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్టుగా తెలిసింది. వారి కోసం నిమ్స్‌లో స్పెషల్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక విధి నిర్వహణలో మరణించే జూనియర్ డాక్టర్ల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. తమ డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించడంతో.. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతకముందు మధ్యాహ్నాం వరకు ఉస్మానియా, గాంధీ సహా అన్నీ భోధనాసుపత్రుల్లో జూడాలు నిరసనలు కొనసాగించారు. మధ్యాహ్నాం ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సమక్షంలో జూడాల సంఘం ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి, సీఎం పేషి ఓస్టీడీ డాక్టర్ టి.గంగాధర్ చర్చల్లో పాల్గోన్నారు. జూడాల సమస్యలు, డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు.