నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణ‌లో జాబ్ క్యాలెండ‌ర్‌.. ఇక ప్ర‌తియేటా కొలువులు

Job Calendar released in Telangana Every year.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2021 2:51 AM GMT
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణ‌లో జాబ్ క్యాలెండ‌ర్‌.. ఇక ప్ర‌తియేటా కొలువులు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది ప్ర‌భుత్వం. ఉద్యోగ నియామ‌కాల‌కు ప్ర‌తి ఏటా జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు దాదాపు ఏడు గంట‌ల పాటు మంత్రిమండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఉద్యోగాల భర్తీ, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు, రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి ప్రణాళికలు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు తదితర అంశాలపై కేబినెట్‌ చర్చించింది. పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపై నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం కూడా సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ మరోమారు సమావేశం కానుంది.

కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులు, అధికారుల సంఖ్య ఎంత మేర‌కు ఉండాలో తేల్చాల‌ని యంత్రాగాన్ని ఆదేశించింది. దీనికి జ‌నాభా ప్రాతిప‌దిక‌గా తీసుకోవాల‌ని సూచించింది. గురుకుల పాఠ‌శాల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని స్థానిక విద్యార్థుల‌కు 50శాతం సీట్ల‌ను కేటాయించాల‌ని కేబినేట్ ఆదేశించింది. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల్లో భాగంగా చేప‌ట్టిన అభివృద్ది ప‌నులు మ‌రింత ముమ్మ‌రంగా సాగాల‌ని ఆదేశించింది.

రాష్ట్రంలో క‌రోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏడు జిల్లాల్లో పర్యటించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు ఆ వివరాలను ఈ సందర్భంగా కేబినెట్‌కు తెలియజేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, ఇచ్చిన సూచనలు, ఇతర క్షేత్రస్థాయి పరిశీలనలు వివరించారు. వ్యాక్సినేషన్‌ ప్రకియతో పాటు పడకలు, మందుల లభ్యత, మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి సమాచారమిచ్చారు. కాగా రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్‌ లభ్యతతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై కేబినెట్‌ చర్చించింది.

Next Story
Share it