తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తన వెన్నంటి నడిచిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు మిత్రులందరికీ ఆయన బహిరంగ పిలుపునిచ్చారు. గత 20 నెలలుగా పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, తనకు జరిగిన వరుస అవమానాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగడం ఇక సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మరియు కార్యకర్తల అభిప్రాయాలను తీసుకునేందుకు ఈనెల 25న (బుధవారం) ఉదయం 10 గంటలకు జగిత్యాల–గొల్లపల్లి రోడ్‌లోని బండారి గార్డెన్‌లో భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై, తన తదుపరి అడుగుపై సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జీవన్ రెడ్డి తీసుకోబోయే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన మార్పులకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.