అధికారిక గీతంగా 'జయ జయ హే తెలంగాణ'.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా 'జయ జయ హే తెలంగాణ' పాట ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు.

By అంజి  Published on  31 May 2024 12:53 AM GMT
Jaya Jaya He Telangana, Telangana, CM Revanth

అధికారిక గీతంగా 'జయ జయ హే తెలంగాణ'.. సీఎం రేవంత్‌ ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా 'జయ జయ హే తెలంగాణ' పాట ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. తెలంగాణ పాట ఒకటి 2.30 నిమిషాలు, మరొకటి 13.30 నిమిషాలతో రెండు వెర్షన్లు ఆమోదించబడ్డాయి. తెలంగాణ నూతన చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా అసెంబ్లీలో ఆమోదం తెలుపుతామని సీఎం రేవంత్‌ తెలిపారు. అయితే, డిజైన్లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇంకా ఏమీ ఖరారు కాలేదు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. వేడుకల సందర్భంగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్నారు. ఆమోదం పొందిన పాటలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని చిత్రీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అమరవీరుల త్యాగాలను భావి తరం స్మరించుకునేలా 'జయ జయ హే తెలంగాణ' పాటను అందరి ఆమోదంతో ఎంచుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

20 ఏళ్ల క్రితం రాసిన ఈ పాటను ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదించినట్లు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి దీనికి సంగీతం అందించారు. గత ఏడాది భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, వాహనాల సంక్షిప్త రూపాన్ని టీఎస్‌ నుంచి టీజీగా మార్చింది. రాజకీయ కారణాల వల్ల టిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్‌గా మారడానికి ముందు) మాదిరిగానే టిఎస్‌ను ఎంచుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది.

వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో పాటు అన్ని తెలంగాణ ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీని ఉపయోగిస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకోలేదని, విగ్రహ రూపకల్పనలో కళాకారులు బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అపోహలకు, తప్పుడు ప్రచారాలకు ఆస్కారం లేకుండా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్‌ తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన పనిని చెరిపేసేందుకే ప్రస్తుతం ఉన్న చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ తోరణం(ఆర్చ్)లను తొలగించాలని కాంగ్రెస్ యోచిస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి గురువారం చార్మినార్‌ను సందర్శించి రెండు చిహ్నాలను తొలగించడాన్ని తమ పార్టీ అనుమతించదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. 2023 డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 64 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Next Story