'తెలంగాణ ఎన్నికల్లో వెనక్కి తగ్గొద్దు'.. పవన్‌కు జనసేన నాయకుల విజ్ఞప్తి

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.

By అంజి  Published on  18 Oct 2023 5:45 AM GMT
Janasena Telangana leaders, Pawan Kalyan, Telangana elections

'తెలంగాణ ఎన్నికల్లో వెనక్కి తగ్గొద్దు'.. పవన్‌కు జనసేన నాయకుల విజ్ఞప్తి

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం అయ్యారు. తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుపట్టలేదని, మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నామని, ఈ సారి తప్పనిసరిగా పోటీ చేయవలసిందేనని ముక్త కంఠంతో కోరారు. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రజల ముందుకు భవిష్యత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్‌ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు.

నేతల అభిప్రాయాలను విన్న పవన్‌ కల్యాణ్‌.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలనని, అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు. పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌కు జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్‌రెడ్డి, తెలంగాణ శాఖ ఇంచార్జి శంకర్‌ గౌడ్‌, ఇతర నాయకులు, నియోజకవర్గాల ఇంచార్జులు పాల్గొన్నారు.

Next Story