తెలంగాణలో పోటీపై జ‌న‌సేనాని కీల‌క ప్ర‌క‌ట‌న‌

Janasena Cheif Pawan Kalyan Comments on Alliances. జ‌న‌సేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్‌ కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

By Medi Samrat  Published on  24 Jan 2023 12:34 PM GMT
తెలంగాణలో పోటీపై జ‌న‌సేనాని కీల‌క ప్ర‌క‌ట‌న‌

జ‌న‌సేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్‌ కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తన ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 7 నుంచి 14 ఎంపీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్ర‌క‌టించారు. తెలంగాణలో పరిమిత స్థాయిలోనే రాజకీయాలు చేస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలుండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన అని పవన్‌ అన్నారు. సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు.. ప్రజలు పోరాట పటిమ చూపారని కొనియాడారు.

తెలంగాణ నేలలో పోరాట స్ఫూర్తి ఉందన్నారు. తనకు పునఃజన్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో కొత్త నాయకత్వం రావాలని పవన్ కల్యాణ్‌ ఆకాంక్షించారు. తెలంగాణలో తమతో పొత్తుకు ఎవరైనా వస్తే స్వాగతిస్తామన్నారు. మంచి భావజాలం ఉన్న పార్టీలతోనే జనసేన పొత్తు పెట్టుకుంటుందన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న యువత కోసం వెతుకుతున్నామ‌ని తెలిపారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తానని ప‌వ‌న్ తెలిపారు. పొత్తు ఎవరితో పెట్టుకున్నా పొలిటికల్ పవర్‌లో భాగం తీసుకుంటామన్నారు.

తెలంగాణలో భావోద్వేగంతో కూడిన‌ రాజకీయాలు ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలున్నాయని అన్నారు. ఏపీలో రాజకీయాలు చేయడం చాలా కష్టమన్నారు. ఒక చిన్న ఉద్యోగానికి ఎన్నో టెస్టులు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఉంటే.. నాయకత్వం వహించాలంటే ఇంకెన్ని పరీక్షలు ఎదుర్కోవాలని పవన్ ప్రశ్నించారు. కాలం పెట్టే పరీక్షలు ఎదుర్కోవడానికి తాను రెడీ అని సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేశారు. చాలా విషయాల్లో తాను తగ్గి మాట్లాడుతున్నానని.. భయపడి కాదని స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమని, తమతో అందరూ కలిసిరావాలన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుంది.. ప్ర‌స్తుతం కలిసే ఉన్నామని స్ప‌ష్టం చేశారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా ముందుకెళ్తామని చెప్పారు. లేదంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేయడానికే వైసీపీ ప్ర‌భుత్వం జీవో నెం.1 ను తీసుకొచ్చింద‌ని.. 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంద‌ని ప్రశ్నించారు.

Next Story