నా కుమారుడు జూనియర్..పదవి ఇవ్వాలని అడగలేదు: జానారెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా మాజీ మంత్రి జానారెడ్డిని కలిశారు.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 1:59 PM ISTనా కుమారుడు జూనియర్..పదవి ఇవ్వాలని అడగలేదు: జానారెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి అయ్యాక తొలిసారిగా మాజీ సీఎల్పీ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్‌రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు జానారెడ్డి. దాదాపు గంటసేపు ఇద్దరు సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రేవంత్‌రెడ్డి కలిసిన తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి జానారెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అలాగే అన్ని హామీలను నెరవేర్చి ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించినట్లు జానారెడ్డి తెలిపారు. సీఎం, మంత్రులు ఐక్యమత్యంతో పనిచేయాలని అన్నారు. అయితే.. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కాను అని.. అంత అవసరం కూడా లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని రేవంత్‌తో చెప్పానని అన్నారు. ఈ మేరకు పలు సూచనలు చేసినట్లు చెప్పారు జానారెడ్డి.
ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కిందపడి గాయం పాలై ఆస్పత్రిలో చేరడం బాధాకరమని జానారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పరామర్శించానని చెప్పారు. త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తన సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు మంత్రి ఉన్నానని అన్నారు. తన కుమారుడు జైవీర్ ఎమ్మెల్యేగా గెలిచాడనీ.. అతన్ని గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు జానారెడ్డి. జైవీర్‌కు పదవి ఇవ్వాలని తాను అడగలేదని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జైవీర్ ఇంకా జూనియర్ మాత్రమే అన్నారు. ఇప్పుడే పదవులు అడగలేమని.. అలా అడగడం సమంజసం కూడా కాదని జానారెడ్డి చెప్పారు.