జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువకుడు లండన్‌లో గుండెపోటుతో మరణించాడు. మృతుడిని ఎనుగు మహేందర్ రెడ్డి (26) గా గుర్తించారు. మహేందర్ రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లాడు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇటీవలే వర్క్ వీసా పొంది అక్కడే పని చేయడం ప్రారంభించాడు.
దురదృష్టవశాత్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు వదిలాడు. మహేందర్ తండ్రి మేడిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మహేందర్ రెడ్డి అకాల మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషాదకర ఘటనపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.