ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి చొరబడ్డ ఆగంతకులు.. విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్‌లోని ఉస్మానియా పీజీ లేడీస్‌ హాస్టల్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 4:38 AM GMT
OU ladies hostel, students, concern, Hyderabad,

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి చొరబడ్డ ఆగంతకులు.. విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్‌లోని ఉస్మానియా పీజీ లేడీస్‌ హాస్టల్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. హాస్టల్‌లో ఉన్న బాత్రూమ్‌ కిటికీలు పగలగొట్టి ఇద్దరు వ్యక్తులు వ్యక్తులు లోపలకి వచ్చారు. అయితే.. కిటికీలు పగలగొట్టని శబ్దాలతో అప్రమత్తమైన విద్యార్థినులు వారిని చుట్టుముట్టారు. అయితే.. విద్యార్థినుల నుంచి ఓ వ్యక్తి తప్పించుకుని పారిపోగా.. మరో వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు హాస్టల్‌ వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు హాస్టల్‌ నుంచి ఆగంతకుడిని బయటకు తీసుకెళ్తున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హాస్టల్‌లో తమకు భద్రత లేదంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని హాస్టల్‌ గేటు వద్దే ఆపి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో రక్షణ లేదంటూ ఆందోళన చేశారు. ఇక ఈ నిరసన పెద్దది కావడంతో ఇతర పోలీసులు, ఉన్నతాదికారులు కూడా సమచారం అందించారు. ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ వద్దకు ఏసీపీ స్థాయి అధికారి వెళ్లిన విద్యార్థులు ఆందోళన విరమించలేదు. ఆగంతకుడిని తీసుకెళ్లే కారుకి దారి ఇవ్వలేదు. దాంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

హాస్టల్‌లో రక్షణ వసతులు సరిగ్గా లేవని చాలా కాలం నుంచి చెబుతున్నామని విద్యార్థినులు అంటున్నారు. గతంలో ఓయూ క్యాంపస్‌లో ఉండేవారమని.. ఇటీవలే బేగంపేట పీజీ లేడీస్‌ హాస్టల్‌కు తరలించినట్లు చెప్పారు. బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయనీ.. రక్షణ గోడలు చిన్నగా ఉన్నాయనీ.. అలాగే సీసీ కెమెరాలు కూడా లేవని దాంతో తమకు రక్షణ కరువైందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విద్యార్థినులు నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని అంటున్నారు.



Next Story