ColdWaveAlert: తెలంగాణలో మూడ్రోజులు జాగ్రత్త, చలి మరింత తీవ్రం

తెలంగాణపై చలి పంజా రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈదర గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు

By -  Knakam Karthik
Published on : 11 Jan 2026 5:32 PM IST

Telangana, Cold Wave Alert, Low Temperatures, Weather Alert, Meteorological Department

ColdWaveAlert: తెలంగాణలో మూడ్రోజులు జాగ్రత్త, చలి మరింత తీవ్రం

తెలంగాణపై చలి పంజా రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈదర గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తుంటే, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు పంజా విసురుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువస్థాయి గాలులు వీస్తుండటంతో రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, 11 నుంచి 15 మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్నిరోజులుగా రాత్రివేళల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా శనివారం పట్టపగలే చలి గజగజ వణికించింది. ఈ చలికి తోడు పొద్దున పూట మంచు దట్టంగా అలుముకుంటోంది. 9, 10 గంటలు దాటుతున్నా మంచు తెర వీడటం లేదు. రోజంతా చలి తీవ్రత ఉంటుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఆదివారం ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరులో ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది, హైదరాబాద్ శివార్లలోని రాజంద్ర నగర్ మరియు హయత్ నగర్‌లలో వరుసగా 10.5 మరియు 12.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మెదక్ మరియు పటాన్‌చెరులలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే గణనీయంగా తక్కువగా ఉంది. ఈ ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.1 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, రాజేంద్ర నగర్‌లలో సాధారణం కంటే 1.6 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 12 జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఎనిమిది జిల్లాల్లో 10.1 మరియు 11 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరియు మిగిలిన జిల్లాల్లో 11.1 మరియు 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story