రైలులో ప్రయాణిస్తూ ఓ యువకుడు అస్వస్థతకు గురైయ్యాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు మృతుడి సోదరుడు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదించగా.. వారు రూ.80వేలు డిమాండ్ చేశారు. అంత చెల్లించే స్తోమత లేక సోదరుడి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలివేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మోతీషా(23) అనే యువకుడు తన సోదరుడితో కలిసి ఏప్రిల్ 28న రైలు ప్రయాణిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే అతడి సోదరుడు మార్గమధ్యంలోని బెల్లంపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చేరిన రెండు గంటల్లోనే అతడు మరణించాడు.
వడదెబ్బతోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. మృతదేహాన్ని స్వస్థలం తీసుకువెళ్లేందుకు ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌ను సంప్రదించగా రూ.80వేలు డిమాండ్ చేశాడు. అంత నగదు చెల్లించే స్థోమత లేని మృతుడి సోదరుడు శవాన్ని ఆస్పత్రిలోనే వదలివేసి వెళ్లిపోయాడు. వైద్యులు మృతుడి సోదరుడిని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించేందుకు యత్నించగా.. స్పందించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.