లబ్ధిదారుల ఖాతాల్లోకి 'ఇందిరమ్మ ఇళ్ల' డబ్బులు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

By అంజి
Published on : 1 July 2025 8:00 AM IST

Indiramma illu, beneficiaries accounts, money, Minister Ponguleti Srinivas

లబ్ధిదారుల ఖాతాల్లోకి 'ఇందిరమ్మ ఇళ్ల' డబ్బులు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అందులో 1.23 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రూ.5 లక్షలతో ఇళ్లను నిర్మించట్లేదన్నారు. సీఎం ఆదేశాలతో ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి తెలిపారు.

నిరుపేద‌లకు గృహ వ‌స‌తి క‌ల్పించ‌డంలో భార‌త దేశంలోనే తెలంగాణ రాష్ట్రం త‌ల‌మానికంగా నిలిచేలా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ ప్ర‌భుత్వం కూడా 5లక్ష‌ల రూపాయలతో ఇండ్ల‌ను నిర్మించ‌డం లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసే ఇండ్ల‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తిఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. పేద‌ వాడికి మ‌రింత చేయూత ఇవ్వాల‌న్న ఆశ‌యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ ట‌న్నుల ఇసుక‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సోమ‌వారం నాడు మంత్రి అధికారుల‌తో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద‌వారికోసం ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించ‌డం ద్వారా రాష్ట్రంలో గుడిసెలు అనేవి లేకుండా చేయాల‌న్న‌దే ఈ ఇందిర‌మ్మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. స్వ‌రాష్ట్రంలో సొంత ఇంటి కోసం నిరుపేద‌లు క‌న్న క‌ల‌లు గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల క‌ల‌గానే మిగిలిపోయాయ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్ర‌భుత్వం పేద‌లు క‌న్న క‌ల‌ల‌ను సాకారం చేస్తోంద‌న్నారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 22,500 కోట్ల రూపాయలతో 4 ల‌క్ష‌ల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాల‌ని ఈ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 3 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేశామ‌ని, ఇందులో 1 ల‌క్షా 23 వేల ఇండ్లు వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్దితి లేకుండా ప్ర‌తి సోమ‌వారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నిధుల‌ను జ‌మ‌చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో కొన్ని జిల్లాల ప‌నితీరు మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ ప్ర‌క్రియ కొలిక్కివ‌చ్చిన నేప‌ధ్యంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌పై దృష్టి సారించాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన స్ధ‌లాల‌ను గుర్తించాల‌ని, వీలైనంత త్వ‌ర‌లో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌తో పాటు వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్, న‌ల్గొండ, త‌దిత‌ర పట్ట‌ణాల‌లో కూడా ఇదే విధానాన్ని అమ‌లుచేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Next Story