ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రూపు సంతరించుకోనుంది.
By - అంజి |
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రూపు సంతరించుకోనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో అర్హులైన లబ్ధిదారులను మార్చి చివరి నాటికి ఎంపిక చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పారదర్శకంగా, రాజకీయ జోక్యం లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. నగర ప్రాంతాల్లో స్థల లభ్యత తక్కువగా ఉన్నందున, పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారు ఉంటున్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 అంతస్తుల (G+9/G+4) అపార్ట్‌మెంట్ తరహా ఇళ్లను నిర్మించాలని యోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించి, ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న లేదా పంపిణీకి నోచుకోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా త్వరలోనే అర్హులకు కేటాయించనున్నారు.
కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరం వెలుపల ఇళ్లు ఇస్తే ఉపాధి కోల్పోతామనే భయం పేదల్లో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రస్తుత నివాస ప్రాంతాలకు దగ్గరలోనే అత్యాధునిక వసతులతో కూడిన బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక భద్రతను కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది.