'కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి'.. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 10 Sept 2024 4:30 PM IST
'కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి'.. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సవాలుగా మారిన రుణ భారాన్ని తగ్గించేందుకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని, రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం కల్పించాలని లేదా అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు.
16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా అధ్యక్షతన, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అనీ మాథ్యూస్, డాక్టర్ మనోజ్ పండా, డాక్టర్ సౌమ్యా కాంతి ఘోష్ సమక్షంలో జ్యోతీబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత పరిస్థితులను వివరించి రాష్ట్ర అభిమతాన్ని ముఖ్యమంత్రి.. వారి ముందుంచారు.
''కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50% కి పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ మీ ముందుకు వస్తోంది. ఈ విషయంలో సానుకూలంగా స్పందించండి. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్. మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నాం. దేశంలోనే వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాది. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలూ ఉన్నాయి'' అని 16వ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ పేర్కొన్నారు.
''గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే ఆ ప్రభావం రాష్ట్ర పురోగతిపై చూపే ప్రమాదం ఉంది. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యానికి మేం సంపూర్ణంగా సహకరిస్తాం. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం'' అని సీఎం రేవంత్ అన్నారు. భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తెలంగాణ తరఫున తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ''ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నాం. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉపయోగపడతాయని మేం విశ్వసిస్తున్నాం'' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.