ఎడతెరిపిలేని వర్షాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు సెలవు
విద్యాసంస్థలకు జూలై 21, 22 తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
By అంజి
ఎడతెరిపిలేని వర్షాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు సెలవు
హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు జూలై 21, 22 తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. మందులు, పాలు, ఇతర ముఖ్యమైన వస్తువుల సరఫరా సహా అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని సీఎం హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేట్ సంస్థలు కూడా తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రెండు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం పాఠశాలలకు వచ్చిన పిల్లలను పాఠశాలలు వెంటనే వెనక్కి పంపించారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. పలు కాలనీలు ఇప్పటికే నీట మునిగాయి. నాలాలు, డ్రైనేజీల్లో వరద నీరు పోటెత్తుతోంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
గురు, శుక్రవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 12-16 కి.మీ వేగంతో పశ్చిమ/దక్షిణ-పశ్చిమ దిశలుగా ఉండే అవకాశం ఉంది.