విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. ఇకపై శనివారం కూడా..

In Telangana Passport Seva Kendras to function on Saturday as well. విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం వాక్-ఇన్ దరఖాస్తులను ప్రత్యేకంగా ప్రాసెస్

By అంజి  Published on  28 Aug 2022 8:45 AM IST
విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. ఇకపై శనివారం కూడా..

విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం వాక్-ఇన్ దరఖాస్తులను ప్రత్యేకంగా ప్రాసెస్ చేయడానికి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారాల్లో కూడా పనిచేస్తాయి. విద్య, ఉపాధి అవకాశాల కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం వారంలో ఐదు రోజులు మాత్రమే పాస్‌ పోర్టు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న చాలా మంది పాస్‌పోర్టు రాక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే శనివారం కూడా పాస్‌పోర్టు సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అయితే వారి దరఖాస్తులను పరిశీలించడానికి 3 వారాల సమయం పడుతోంది. ఈ సమస్యపై ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఔసఫ్‌ సయీద్‌తో చర్చలు జరిపామని దాసరి బాలయ్య తెలిపారు.

ఈ మేరకు పాస్‌పోర్ట్ హోల్డర్ల ఉపాధి, విద్యా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని.. పాస్ట్‌పోర్టు కార్యాలయం పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను శనివారం కూడా తెరవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని మూడు పిఎస్‌కెలు (అమీర్‌పేట్, బేగంపేట్, టోలీచౌకి) తో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌ సెప్టెంబర్ 3 నుండి సేవలు పనిచేయడం ప్రారంభిస్తాయి.

Next Story