తెలంగాణలో కరోనా నిబంధనలు కఠినతరం
Implement Covid protocols in all walks of life says CS Somesh Kumar.తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా
By తోట వంశీ కుమార్ Published on 2 Jan 2022 4:10 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. జనవరి 2 వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉండగా.. వాటిని ఈ నెల(జనవరి) 10 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో ఈ నెల(జనవరి) 10 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలపై నిషేదం అమల్లో ఉంటుంది.
ఇక మాస్క్‌లు తప్పని సరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను ధరించకుంటే రూ.1000 జరిమానాను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలు, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ్యాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వంటి అందులోబాటులో ఉండేలా ఆయా యాజమాన్యలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక విద్యాసంస్థల్లోనూ సిబ్బంది, విద్యార్థులు విధిగా మాస్కులు ధరించడంతో పాటు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. చిన్నారులకు సంబంధించి జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. జవవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.
ఇక నిన్న రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. వీరిలో 27 మంది కోలుకున్నారు. రోజువారీ కరోనా కేసుల విషయానికొస్తే.. నిన్న 317 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 217 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 232 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు మరణించారు. కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,215 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,74,453 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.