బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. గత నెలలో ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగగా.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామి హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించిన సంగతి తెలిసిందే. అయితే.. మళ్లీ గత రాత్రి విద్యార్థులు నిరసనలకు దిగారు.
ఫుడ్ పాయిజన్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ‍్యక్తం చేశారు. రాత్రి అంతా విద్యార్థులు భోజనం చేయకుండా మెస్‌లోనే జాగారం చేశారు. నిరసనలు ఉదృతం చేస్తామనన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. దీంతో నేడు మరోసారి విద్యార్థులతో అధికారులు సమావేశం కానున్నారు.