ఆక్రమణలను వదిలిపెట్టండి.. హైడ్రా ఎవరినీ వదిలిపెట్టదు: సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ హైడ్రా వదిలిపెట్టదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
By అంజి Published on 11 Sept 2024 12:50 PM ISTఆక్రమణలను వదిలిపెట్టండి.. హైడ్రా ఎవరినీ వదిలిపెట్టదు: సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ హైడ్రా వదిలిపెట్టదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ మాట్లాడారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలను వెంటనే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. లేకపోతే హైడ్రా వచ్చి కచ్చితంగా కూల్చివేస్తుందని తెలిపారు. అందులో ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పస్టం చేశారు. కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా తాత్కాలిక ఊరటే అవుతుందని వ్యాఖ్యానించారు.
చెరువులను కబ్జా చేసే వారిని చెరసాలకు పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతోనే హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ఆక్రమణల కారణంగానే నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయని తెలిపారు. హైడ్రా ఎంట్రీతో ఎలాంటి ఆక్రమణలు అయినా నేలమట్టం కాక తప్పదన్నారు. కబ్జాదారులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. సంపన్నులు చెరువులు, కుంటలను కబ్జా చేసి ఫాంహౌస్‌లను కట్టుకుని సీఎం ఆరోపించారు. ఆగర్భ శ్రీమంతుల ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు గండిపేటలో కలుస్తున్నాయని, హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌లో కలిసే డ్రైనేజీ నీళ్లను నగరంలోని పేద ప్రజలు తాగాలా? అని ప్రశ్నించారు.
ధనవంతులు చెరువులు, కుంటలు ఆక్రమించుకుంటే తాను సీఎంగా విఫలం అయినట్టేనని, అందుకే తాను ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. మూసీ నదిలోకి హైదరాబాద్ నగరంలోని మురుగు నీరు చేరుతుండటంతో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టిందని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారంతా అక్కడి నుంచి ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.