హైడ్రా 'మాన్సూన్​ ఎమర్జెన్సీ టీమ్స్​' ఏర్పాటు..రంగంలోకి 4100 మంది సిబ్బంది

వ‌ర్షాకాలం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధ‌మైంది.

By Knakam Karthik
Published on : 2 July 2025 11:26 AM IST

Hyderabad News, Hydra, Moonsoon emergency teams, Sdrf, rainy season

హైడ్రా 'మాన్సూన్​ ఎమర్జెన్సీ టీమ్స్​' ఏర్పాటు..రంగంలోకి 4100 మంది సిబ్బంది

ఈ వానాకాలం సీజన్ నుంచి హైదరాబాద్ వాసులను వరద సమస్యల నుంచి గట్టెక్కించేందుకు హైడ్రా సిద్ధమైంది. వ‌ర్షాకాలం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధ‌మైంది. మొత్తం 4100 మంది సిబ్బందితో రంగంలోకి దిగింది. 150 మాన్సూన్​ ఎమర్జెన్సీ బృందాలను క్షేత్రస్థాయిలోకి దించింది. వీరు ఒక్కో షిఫ్టులో నలుగులు చొప్పున 3 షిఫ్టుల్లో పని చేయనున్నారు. ఇలా 150 మాన్సూన్​ ఎమర్జెన్సీ బృందాల్లో మొత్తం 1800ల మంది ఉంటారని హైడ్రా తెలిపింది. వర్షపు నీరు నిలిచే చోట రెండు షిఫ్టులో పని చేసేలా 734 మంది సిద్ధమయ్యారంది. 51 హైడ్రా డీఆర్​ఎఫ్​ బృందాలు వర్షాకాలం పనుల్లో నిమగ్నమయ్యాయని హైడ్రా పేర్కొంది.

ఒక్కో బృందంలో 18 మంది ఉంటారని వివరించింది. 918 మంది డీఆర్​ఎఫ్​ సిబ్బంది సేవలందిస్తారంది. ఒక్కో షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున పని చేయనున్నారు. వీరికి తోడు ఎమర్జెన్సీ బైకు బృందాలు 21 ఉన్నాయని, ఒక్కో బైకుపైన ఇద్దరు చొప్పున మొత్తం 42 మంది పని చేస్తారని తెలిపింది. 30 స‌ర్కిళ్లలో ప‌నుల‌ను ప‌ర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన మార్షల్స్ 30 మంది ఉంటారని, ట్రాఫిక్ పోలీసుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు రెండు షిప్టుల్లో క‌లిపి 200ల మందితో 20 బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ప‌ని ముట్లు పంపిణీ..

వ‌ర‌ద నీరు నిలిచిన‌ వెంట‌నే తోడేందుకు నీటి పంపులు, చెట్లు ప‌డిపోతే తొల‌గించ‌డానికి క‌టింగ్ మెషిన్లు, చెత్త‌ను తొల‌గించ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌న్నీ 150 స్టాటిక్ బృందాల‌తో పాటు.. 51 డీఆర్ఎఫ్ బృందాలకు అప్ప‌గించారు. వ‌ర్షాకాలంలో ప‌ని చేసే ఈ బృందాల‌న్నిటికీ ఒక్క‌రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి సేవ‌ల తీరును వివ‌రించారు. ఈ బృందాల‌న్నీ ఆయా డివిజ‌న్ల‌లో ఉండి సేవ‌లందిస్తాయి. ట్రాఫిక్ సాఫీగా సాగేలా ట్రాఫిక్ పోలీసుల‌తో 20 బృందాలు ప‌ని చేస్తాయి. అలాగే చెత్త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించేందుకు త‌గిన వాహ‌నాల‌ను, ప‌ని ముట్లును కూడా హైడ్రా స‌మ‌కూర్చింది.

24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి: హైడ్రా కమిషనర్

వర్షం ఎప్పుడు పడుతుందో, ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. వర్షానికి ముందే రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. నాలాలు, కల్వర్టులను పరిశీలించి..వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Next Story