రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని 951, 952 సర్వే నెంబర్లలోని అనధికార నిర్మాణాలపై హైడ్రా ఆదివారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. రాధే ధామమ్ లే అవుట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. కోహెడ ప్రాంతంలో ఓ రియల్టర్ కొందరు వ్యక్తులకు చెందిన ప్లాట్లను కబ్జా చేసి, దర్జాగా ఫామ్ హౌజ్ నిర్మించుకున్నాడు. దీనిపై ప్లాట్ ఓనర్స్ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయింది.
దీంతో 170 మంది ప్లాట్ ఓనర్స్ హైడ్రాను సంప్రదించారు. ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి ఫిర్యాదు చేశారు. కోహెడ గ్రామంలో సర్వే నెంబర్ 951, 952 లోని 7.258 గుంటల భూమిని ఓ రియల్టర్ కబ్జా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. కోహెడ ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు పై విచారణ చేపట్టారు. ఆదివారం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. దీంతో తమకు న్యాయం జరిగిందని ప్లాట్ ఓనర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదుపై స్పందించి న్యాయం చేసిన హైడ్రాకు కృతజ్ఞతలు చెబుతున్నారు.