పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది.
By Knakam Karthik
పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. రహదారులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్‌లోని కబ్జాకు గురైన ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 1, 10, 11లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. కాగా నిన్న మేడిపల్లిలోని సెజ్ స్కూల్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనంతరం బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలను పరిశీలించిన అనంతరం కబ్జా జరిగినట్లు గుర్తించారు. దీంతో హైడ్రా కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.