ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్
హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
By Knakam Karthik Published on 3 March 2025 9:15 PM IST
ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్
హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని, హోర్డింగులు తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని చెప్పారు. అక్రమ హోర్డింగుల తొలగింపులో మినహాయింపులు ఉండవని తెలిపారు. హోర్డింగుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలనేదే హైడ్రా టార్గెట్ అని..రంగనాథ్ చెప్పారు.
మూడు నెలల క్రితం నుంచే ఈ అంశాన్ని చేపట్టామని, యాడ్ ఏజెన్సీలకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని యాడ్ ఏజెన్సీ ప్రతినిధులకు చెప్పారు. గత రెండు నెలల్లో పలుమార్లు మున్సిపల్ కమిషనర్లు, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుం గడువు 2024 మార్చి 31 వరకూ ఉందని.. ఈలోగా 2024 మార్చి 31వ తేదీ తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించాల్సి ఉన్న నేపథ్యంలో రెన్యూవల్స్ ఆగిపోయాయని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుములు కూడా కట్టలేకపోయామని పలువురు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో 2023 మార్చి 31 వరకూ చెల్లింపులు చేసిన హోర్డింగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ తొలగించమని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌గారు చెప్పారు. వాస్తవానికి అడ్వర్‌టైజ్‌మెంట్ హోర్డింగుల ద్వారా ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా ప్రస్తుతం దాదాపు రూ.20 నుంచి రూ.30 కోట్లు మాత్రమే వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. అక్రమ హోర్డింగుల తొలగింపులో ఎలాంటి మినహాయింపులకు హైడ్రా అవకాశం ఇవ్వదని..ప్రభుత్వ ఆదాయం పెరగాలనేదే హైడ్రా లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు.