హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్
కూకట్‌పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు
By Knakam Karthik
హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా శుక్రవారం కూకట్‌పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణ పనులపై హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా మొదటివిడతగా చేపట్టిన 6 చెరువులలో సున్నం చెరువు, తుమ్మిడికుంట, కూకట్‌పల్లి నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులను ఏవీ రంగనాథ్ సందర్శించారు. స్థానికులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు. నగరంలో చెరువుల పునరుద్దరణ, సుందరీకరణ పనులకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుందని రంగనాథ్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ చెరువుల బాధ్యతను హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని ఏవీ రంగనాథ్ చెప్పారు. త్వరలోనే చెరువుల్లో జీవకళను అందరూ చూస్తారని రంగనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ కింద సహాయం అందిస్తుందని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పటికి నివాసముంటోన్న ఇళ్లను కూల్చబోమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు. కాగా దాదాపు రూ.58.50 కోట్లతో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, రాజేంద్రనగర్‌లోని భమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువు, బతుకమ్మ కుంట చెరువులను మొదటి విడతగా హైడ్రా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చెరువులలో డీ వాటరింగ్ పనులను హైడ్రా చేపట్టింది. ముందుగా చెరువులలో ఉన్న వ్యర్థ జలాలను బయటకు పంపించి.. ఎండబెడుతున్నారు. వచ్చే జూన్ నాటికి ఈ చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో హైడ్రా ముందుకు వెళ్తోంది.