హైదరాబాద్‌లో భారీగా ISI మార్క్ లేని శానిటరీ ప్యాడ్స్ సీజ్
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఓ ఫ్యాక్టరీలో నకిలీ శానిటరీ ప్యాడ్స్‌ను అధికారులు సీజ్ చేశారు.
By Knakam Karthik
హైదరాబాద్‌లో భారీగా ISI మార్క్ లేని శానిటరీ ప్యాడ్స్ సీజ్
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఓ ఫ్యాక్టరీలో భారీగా నకిలీ శానిటరీ ప్యాడ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నకిలీ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్నారనే సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ అధికారులు ఓ ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ క్రమంలో 30 వేలకు పైగా ఐఎస్‌ఐ మార్క్ లేని ప్యాడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ 30 వేల శానిటరీ ప్యాడ్స్, 7 వేలకు పైగా లేబుల్ కవర్లకు ఐఎస్ఐ మార్కు లేకుండా మార్కెట్‌లోకి తరలించేందుకు సిద్ధంగా ఉండటంతో సీజ్ చేశారు. ఈ కేంద్రంలో ఎటువంటి ధృవీకరణ పత్రం లేకుండా పెద్ద మొత్తంలో శానిటరీ న్యాప్‌కిన్లు నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు బీఐఎస్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు.
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం, అన్ని శానిటరీ ప్యాడ్‌లకు ISI 5405:2019 ప్రమాణాలతో BIS సర్టిఫికేషన్ తప్పనిసరి. BIS సర్టిఫికేషన్ పొందకుండా వాటిని విక్రయించే, తయారు చేసే లేదా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని ఆయన అన్నారు. BIS చట్టం 2016లోని సెక్షన్ 17 ప్రకారం, ఎవరైనా ISI మార్క్, రిజిస్ట్రేషన్ మార్క్ లేకుండా లేదా BIS అనుమతి పొందకుండా BIS సర్టిఫికేషన్ తప్పనిసరి అయిన ఏదైనా ఉత్పత్తిని తయారు చేసినా, విక్రయించినా లేదా నిల్వ చేసినా, వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. మొదటిసారి నేరం చేస్తే రూ.2 లక్షల జరిమానా, రెండవసారి నేరం చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా కూడా విధించవచ్చు. "ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం 679 ఉత్పత్తులను ధృవీకరణ కోసం తప్పనిసరి చేస్తూ అనేక నాణ్యత నియంత్రణ ఉత్తర్వులు జారీ చేసింది" అని ఆయన అన్నారు.