హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం, స్టేషన్ సిబ్బంది మొత్తం ఒకేసారి మార్పు

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  31 Jan 2024 7:45 AM GMT
hyderabad, police commissioner, sensational decision, panjagutta, police station,

హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం, స్టేషన్ సిబ్బంది మొత్తం ఒకేసారి మార్పు

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి మార్చేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు అందర్నీ మార్చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్‌. ఈ మేరకు వారిని మారుస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఈ బదిలీలు జరిగాయి. ఈ స్టేషన్‌కు వివిధ పోలీస్‌ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వహించిన వారిని వీఆర్‌కు అటాచ్‌ చేశారు.

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడి యాక్సిడెంట్‌ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుతో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా కేసు విషయాలను బహిర్గతం చేయడంతో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఒకేసారి సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 86 మంది పోలీసు సిబ్బందిని వీఆర్‌కు అటాచ్ చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ చరిత్రలో ఇలా ఒకేసారి స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని మార్చడం తొలిసారి కావడం విశేషం. ఒకప్పుడు ఇండియాలోనే బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌గా పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు అవార్డు వచ్చింది. కానీ.. ఇప్పుడు పోలీస్‌ కమిషనర్‌ అదే పీఎస్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

డిసెంబర్ 23న ప్రగతి భవన్‌ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు అప్పటి సీఐ దుర్గారావు ప్రయత్నించాడు. నిందితుడి స్థానంలో మరొకరు స్టేషన్‌లో లొంగిపోయాడు. తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. కేసును తప్పుదోవ పట్టించిన షకీల్, కుమారుడు రాహిల్‌పై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత పంజాగుట్ట సీఐ దుర్గారావుని సస్పెండ్ చేసి కేసు కూడా నమోదు చేశారు.



Next Story