గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త మెట్రో మార్గాలకు శంకుస్థాపన

త్వరలోనే కొత్త మెట్రో మార్గాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 6:43 AM IST
hyderabad, metro, new route, cm revanth reddy,

గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త మెట్రో మార్గాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ గురించి అందరికీ తెలిసిన విషయమే. రోడ్లపై ఒక్కసారి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందంటే చాలు అది క్లియర్ అవ్వడానికి కొన్నిసార్లు గంట సమయం పట్టొచ్చు. అయితే.. ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రయాణికులు సులువుగా ప్రయాణం చేసేందుకు ప్రభుత్వం మెట్రో రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే.. ఇది అన్ని మార్గాల్లో అందుబాటులో లేకపోయినా దీనికి ఆదరణ బాగానే ఉంది. ఇక ప్రస్తుతం మెట్రో రైళ్లలో కూడా రద్దీ పెరిగిపోతుంది. అయితే.. తాజాగా ఇంకొన్ని మార్గాల్లో మెట్రో రైలును విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే కొత్త మెట్రో మార్గాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు.

శుక్రవారం హెచ్‌ఎండీఏ కార్యాలయంలో వాటర్‌ వర్క్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్‌ఎంసీపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవనాలకు పర్మిషన్ల ఫైల్స్‌ క్లియర్‌గా ఉండాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో కాకుండా ఇష్టారీతిగా అనుమతులు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తే ఇంటికే వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాలన్నారు. మ‌ల్లన్న సాగ‌ర్‌, కొండ‌ పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్రణాళిక ర‌చించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

కొత్త మెట్రో రైలు రూట్‌ మ్యాప్:

హైదరాబాద్‌ నగరంలో ఫేజ్‌-2 కింద 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సికింద్రాబాద్-జూబ్లీహిల్స్‌ బస్‌ స్టేషన్ల మధ్య ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు నెట్‌వర్క్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడగించనున్నారు. అంతేకాక నాలుగు కొత్త కారిడార్లలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు

కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫల్‌నుమా వరకు (5.5 కి.మీ), ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు (1.5 కి.మీ)

కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్ వరకు, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, పి7 రోడ్‌ను శంషాబాద్ విమానాశ్రయానికి కలుపుతుంది (మొత్తం 29 కి.మీ); ఆరామ్‌ఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లోని ప్రతిపాదిత హైకోర్టుకు మైలార్‌దేవ్‌పల్లి. (4 కి.మీ)

కారిడార్ 5: రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్షన్, యూఎస్ కాన్సులేట్ (8 కి.మీ)

కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి పటాన్చెరు వరకు BHEL (14 కి.మీ)

కారిడార్ 7: ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం, హయత్‌నగర్ (8 కి.మీ)

Next Story