తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వీటితోపాటు క్యుములోనింబస్ మేఘాల వల్ల పగటిపూట ఉష్ణతీవ్రత, సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రాగల నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు చెప్పారు.
మరో వైపు నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.