Hyderabad: పాల వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 17 May 2024 11:36 AM ISTHyderabad: పాల వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. కియా కారు అతివేగంగా వచ్చి పాల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి పోలీసులు చికిత్స చేయిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం పిల్లర్ నెం 1716 దగ్గర చోటుచేసుకుంది. ఉదయం రోడ్లు ఖాళీగా ఉండటం వల్ల చాలా వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే కియా కారు కూడా వేగంగా వచ్చింది. రోడ్డుపక్కన ఉన్న పాల వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దాంతో.. ఆ వాహనంలో ఉన్న పాల డబ్బాలన్నీ కిందపడిపోయాయి. పాలన్నీ నేలమయం అయ్యాయి. అక్కడే ఉన్న ఒక వ్యక్తిని కారు బలంగా ఢీకొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రగాయాల పాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. కాగా.. కియా కారును డ్రైవ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాల వాహనం మీదకు దూసుకెళ్లినట్లు సమాచారం. మద్యం తాగి వాహనం నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా.. పోలీసులు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు కియా కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: మాదాపూర్లో రోడ్డు ప్రమాదం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 17, 2024
పాల వాహనాన్ని ఢీకొట్టిన కియా కారు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/EG7pc51tHt