హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సిటీ పోలీసులు అప్రమత్తం చేశారు. టూ వీలర్ బుల్లెట్ వాహనంపై తిరగవద్దు అంటూ హెచ్చరించారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తిరగాలని పోలీసులు సూచించారు. సెక్యూరిటీ థ్రెట్ ఉన్న నేపథ్యంలో గన్‌మన్‌ల సంరక్షణలోనే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన 1+4 సెక్యూరిటీని సద్వినియోగం చేసుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే గత నెల రోజులుగా రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని,. ఇవాళ కాకపోతే రేపు అయినా అంతు చూస్తామంటూ రాజాసింగ్‌కు బెదిరింపులు వస్తున్నాయి. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా ఆయన అనుచరులు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అలర్ట్ చేశారు. సెక్యూరిటీ విషయంలో పూర్తిస్థాయిలో సహకారం అందించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కోరారు.
అయితే, గోషామహల్ లో ప్రాంతంలోని చిన్న చిన్న గల్లీల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రజల్లోకి వెళ్లలేనని పోలీసులకు రాజాసింగ్ తెలిపారు. అదేవిధంగా తన గన్ లైసెన్స్ దరఖాస్తు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని, తన లైసెన్స్ రెన్యూవల్ చేయాలని రాజాసింగ్ పోలీసులను కోరారు.