వేటకు వెళ్లిన ఓ వ్యక్తి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం నుంచి అతడు నరకయాతన అనుభవిస్తున్నాడు. అతడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన రాజు మంగళవారం సాయంత్రం వేటకు ఘన్‌పూర్ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. ఓ చోట గుట్టపై ఏదో జంతువు కనిపించినట్లు అనిపించింది. ఆ రాళ్లపైకి వెళ్లి వెతుకుతున్న క్రమంలో అతడి సెల్‌ఫోన్ జారి రాళ్ల మధ్యలో పడిపోయింది. ఫోన్ తీసే క్రమంలో అతడు రాళ్ల మధ్యన తలక్రిందులుగా ఇరుక్కుపోయాడు.
బయటకు వచ్చే అవకాశం లేక రాత్రంతా ఆర్తనాదాలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. రాజు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడి కోసం అడవిలో వెతుకుతుండగా బుధవారం మధ్యాహ్నాం రాళ్ల మధ్యలోంచి అరుస్తున్న రాజును గుర్తించారు. గ్రామస్తుల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
వారి వల్ల సాధ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులు ముందుగా అతడికి వాటర్, ఓఆర్ఎస్ ద్రావణాన్ని రంధ్రం గుండా అందించారు. అనంతరం అతడిని రక్షించే ప్రయత్నాలు ప్రారంభి విఫలం అయ్యారు. జేసీబీ, ఫైరింజన్‌ను రప్పించారు. బుధవారం రాత్రి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా.. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమారై ఉంది.