తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారినపడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ వెసులుబాటును ఏడు తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. గుండె జబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, మూత్ర కోశ వ్యాధులు, ఎయిడ్స్ , మెదడు వ్యాధులుకు ఈ స్పెషల్ లీవ్ ఇస్తున్నారు.
కాగా ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ (తీవ్ర కాలేయ వ్యాధి) బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని నిర్ణయించడంతో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలేయ వ్యాధికి గురైన కార్మికునికి స్పెషల్ లీవు మంజూరు చేయవచ్చని, వ్యాధి నయమై, విధులకు ఫిట్ అయ్యేంతవరకు అతనికి 50 శాతం వేతన మొత్తం (బేసిక్ పే, వీడిఏ, ఎస్ డి ఏ లో 50 శాతం ) చెల్లించవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.