2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యవయం రూ.2,20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 72,659 కోట్లు కేటాయించారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీని ప్రకటించడమే కాకుండా.. ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేశామని.. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల లోపు రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దుబారా ఖర్చులు కట్టడి చేశామన్నారు భట్టి. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు. గత పాలకులు రూ.6,71,757 కోట్లు అప్పు చేశారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పు 10 రెట్లు పెరిగిందని, రాష్ట్రం అభివృద్ధి చెందలేదని భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు.