రైతు పంట రుణం ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే

బ్యాంకులు ఇచ్చే లోన్లలో వ్యవసాయ రుణాలు కీలకం. ప్రస్తుతం గ్రామీణ బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో సుమారు 75 శాతం వ్యవసాయానికి సంబంధించినవే.

By అంజి  Published on  23 Aug 2024 7:15 AM IST
farmer, crop loan, Area Bank, Telangana

రైతు పంట రుణం ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే

బ్యాంకులు ఇచ్చే లోన్లలో వ్యవసాయ రుణాలు కీలకం. ప్రస్తుతం గ్రామీణ బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో సుమారు 75 శాతం వ్యవసాయానికి సంబంధించినవే. రైతులు పంట రుణాలు తీసుకునేటప్పుడు సమగ్ర సమాచారంతో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. మిగిలిన రుణాలతో పోలిస్తే పంట రుణాలకు వడ్డీ తక్కువ. సాధారణంగా ఇది 7 శాతంగా ఉంటుంది.

రైతులు సరైన సమయంలో క్రాప్‌లోన్‌ రెన్యువల్‌ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఉదాహరణకు ఏడాది కాలానికి రైతు లక్ష రుపాయలు రునం తీసుకొని సకాలంలో చెల్లిస్తే 7 శాతం మాత్రమే వడ్డీ ఉంటుంది. నిర్ణీత సమయంలో రైతు చెల్లించినందుకు ప్రభుత్వం తిరిగి 3 శాతం వడ్డీ డబ్బును తిరిగి రైతు అకౌంట్‌లో జమ చేస్తుంది. అంటే లక్ష రుపాయల లోన్‌ తీసుకున్న రైతు గడువు తేదీలోపల 4 శాతం మాత్రమే వడ్డీ చెల్లించినట్టు అవుతుంది.

గడువు తేదీ తర్వాత రునం చెల్లిస్తే ప్రభుత్వం తిరిగి చెల్లించే 3 శాతం సబ్వెన్షన్‌ రైతుకు అందదు. అలాగే రుణంపై వడ్డీరేటు 13.75 శాతానికి పెరిగిపోతుంది. ఇది అన్నదాతకు అదనపు భారం అవుతుంది.

గ్రామాలు లేదా పట్టణాల్లోని సర్వీస్‌ ఏరియా బ్యాంకులలో ఎక్కువగా రుణాలు ఇస్తారు. అవి వాణిజ్య, గ్రామీణ బ్యాంకులైనా, ప్రాథమిక సహకార సంఘాలు అయినా కావొచ్చు. ఇలా ప్రతి బ్యాంకుకు కొన్ని గ్రామాలు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇలా దేశంలోని ప్రతి గ్రామాన్ని ఏదో ఒక బ్యాంకుకు అటాచ్‌ చేస్తారు. పంట రుణాలు ఎక్కువగా సర్వీస్‌, ఏరియా బ్యాంకులు మాత్రమే ఇస్తున్నాయి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొద్దిపాటి తేడాతో డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంటకు రుణం మారుతూ ఉంటుంది. పంట రుణం రూ.1,60,000 వరకు ఉంటే ఎలాంటి తనఖా లేకుండా ఇద్దరు సభ్యుల పూచీకత్తుతో ఇస్తారు. పంట రుణం రూ.1,60,000 నుంచి 3,00,000 వరకు ఉంటే వ్యవసాయ భూమిని తనఖా పెట్టాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

రైతు పట్టాదారు పాసుపుక్తం, మండల రెవెన్యూ అధికారి జారీ చేసిన పహాణీ పత్రం, భూమికి సంబంధించిన 1-బి పత్రం, బ్యాంకు మేనేజర్‌ కోరితే ఇతర బ్యాంకుల నుంచి నోడ్యూ సర్టిఫికెట్‌, సాగు చేస్తున్న పంటల వివరాలు, భూమి విస్తీర్ణం, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోస్‌

Next Story